Pages

Monday, August 29, 2016

గురువులం

గురువులం

మేమిలాగే ఉంటాం,
 ఎప్పటిలాగే ఉంటాం
ఎందుకంటే, మేం కేవలం గురువులం!
నీడనిచ్చు చెట్టులా, వాననిచ్చు మబ్బులా!
వెంటపడే నాన్నలా, పక్కనుండే అమ్మలా!
మాలో మార్పు లేదు, ఓర్పు మాత్రమే ఉంది!
అవే చూపులు, అవే మాటలు
అవే పాఠాలు, అవే నల్లబల్లలు
అవే సుద్దముక్కలు, అవే రాతలు!
విసుగు చెందని మనసులు మావి
విరామమెరుగని వృత్తులు మావి!
సంపాదించే వ్యాపారులం కాము
పాలించే నాయకులం కాము!
చిన్నచూపు చూసినా చింతించం
పెద్ద మనసు చేసినా గర్వించం!
నాలుగు గోడలే మా ప్రపంచం
విద్యాలయమే మా విశ్వనగరం!
ఎందుకంటే, మేం కేవలం గురువులం!

ఎన్నో కళ్ళు మావైపు చూస్తుంటాయి
రెండే కళ్లు మిమ్మల్ని అదుపు చేస్తుంటాయి!
మీ రాతలను, గీతలను సరిచేస్తూ
మీ మాటలను, చేతలను సవరిస్తూ
మీ చదువే మా చదువుగా
మీ మార్కులే మా మార్కులుగా!
మంచి కోసమే నిందిస్తాం
బాగు కోసమే బాధిస్తాం!
ఎదుగుతూ ఒదుగుతూ
ఎక్కడికో ఎగిరెగిరి పోతుంటారు
ఎక్కడినుండో ఏనాటికో వాలిపోతారు!
మీరే స్థితిలో ఉన్నా మహదానందం
మీ పలకరింపే పరమానందం!
గురువును మించిన శిష్యులైనా
కొండ అద్దమందు చిన్నదవదా!
మీరెంత ఎత్తుకు ఎదిగినా
మాముందు చిన్నపిల్లలే కదా!
ఎందుకంటే, మేం కేవలం గురువులం!

ఎగతాళి చేసిన మీ చేతులే భక్తితో జోడిస్తాయి
వెక్కిరించిన మీ మాటలే వినయంగా వినిపిస్తాయి!
మీ బాల్యస్మృతులకు చిరునామా మేము
మీ భవిష్యత్తుకు నజరానా మేము!
మీరంటే ఒక జలపాతం, ఒక నదీ ప్రవాహం!
నిలకడలేని ఆపసోపాల ప్రయాణం మీది
నిశ్చలమైన నిలువెత్తు నిగ్రహం మాది!
నేర్చుకుంటూ జ్ఞానతృష్ణతో వెళ్ళిపోతుంటారు
నేర్పిస్తూ లక్ష్యాన్ని చూపిస్తూ నిలిచిపోతుంటాం!
మా క్షేమం కన్నా మీ సంక్షేమం మిన్న
మా ఆనందం కన్నా మీ ఆశయం మిన్న
ఎందుకంటే, మేం కేవలం గురువులం

No comments:

Post a Comment

.